వైయస్ కంటే బాబుది రెట్టింపు అవినీతి

SMTV Desk 2017-05-28 19:10:03  kavuri, cm chandra babu,TDP,YS

విజయవాడ, మే 27 : తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు భారతీయ జనతా పార్టీ నేత కావూరి సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పనితీరు అధ్వాన్నంగా ఉందని అన్నారు. గ్రామస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు కావూరి సాంబశివరావు తెలిపారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు గ్రాఫ్ పడిపోతోందని, అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలపడటం లేదని కావూరి అన్నారు. వైయస్ అవినీతి కంటే టీడీపీ అవినీతి రెట్టింపయ్యిందని ధ్వజమెత్తారు. గతంలోనే తాను ఈ విషయాన్ని చెప్పానని కావూరి తెలిపారు. తెలుగుదేశం మిత్రపక్షం కాబట్టి ఆ ప్రభావం బీజేపీపైనా పడుతుందని అన్నారు. అన్ని విషయాలపై అమిత్ షాకు వివరించినట్లు కావూరి సాంబశివరావు తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని లాంటి వ్యక్తులు చేసే ఆరోపణలపై తాను స్పందించనని అన్నారు. నిబద్ధత కలిగిన నేతలు మాట్లాడితే స్పందిస్తానని అన్నారు. రాజీవ్ గాంధీ మృతి అనంతరం ఎన్నికల ఫలితాలు తారుమారయ్యాయని కావూరి అన్నారు. ఇంకా రెండేళ్లే సమయం ఉందని, ఏదైనా జరగవచ్చని కావూరి చెప్పారు. కేంద్ర పథకాలు టీడీపీ, బీజేపీ వాళ్లకే కాదు.. ప్రతీ పేదవాడికీ అందేలా చేయాలన్నారు. ఓ వైపు అమిత్ షా, చంద్రబాబునాయుడులు విందు సమావేశాలు నిర్వహిస్తుంటే .. టీడీపీ, బీజేపీ నేతలు మాత్రం పరస్పర విమర్శలు చేసుకుంటుండటం గమనార్హం.