పాక్ లో ఉన్న చైనీయులకు భద్రతలు కల్పించాలి :చైనా అధికారులు

SMTV Desk 2017-12-08 18:47:41  pak, china, Terrorists Attacks china people

బీజింగ్, డిసెంబర్ 08 : చైనా ప్రజలు పాకిస్థాన్ లో ఉండటంతో, ప్రజలపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశం భయపడుతోంది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన నిర్మాణ పనుల అనంతరం చైనాకు చెందిన వందలాది కార్మికులు, పలు కంపెనీల ఉద్యోగులు పాకిస్థాన్‌ వెళ్లారు. అయితే, అక్కడ ఉన్న చైనీయులపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని చైనా రాయబార కార్యాలయం తగు జాగ్రత్తలు చెబుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. బయట ప్రదేశాలకు వెళ్లడం వీలైనంత మేర తగ్గించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఏమైనా అత్యవసర సహాయం కావాలంటే వెంటనే చైనా రాయబార అధికారులను ఆశ్రయించాలని లేదా పాకిస్థాన్‌ పోలీసులు, ఆర్మీ సాయం తీసుకోవాలని సూచించింది. కొద్ది నెలల క్రితం బలూచిస్థాన్‌లో పనిచేస్తున్న ఇద్దరు చైనా ఉపాధ్యాయులను కిడ్నాప్‌ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే, ఆ హత్యలు తామే చేశామంటూ అప్పట్లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. దీంతో పాక్‌లో ఉంటున్న చైనీయులకు భద్రతను పెంచాల్సిందిగా అప్పుడు ఇస్లామాబాద్‌ ప్రభుత్వాన్ని చైనా అధికారులు కోరగా, ఇంకా పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.