దక్షిణకొరియా విశేషాలను తెలిపిన సీఎం చంద్రబాబు

SMTV Desk 2017-12-08 17:56:19  AP CM Chandrababu naidu, cm Camp office, media, amaravathi

అమరావతి, డిసెంబర్ 08 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానైన అమరావతిని సింగపూర్ తరహాలోని కొరియన్‌ సిటీగా అభివృద్ధి చేయాలని, ఈ మేరకు దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలను కోరామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 6న దక్షిణకొరియా నుంచి తిరిగి వచ్చిన ఆయన అక్కడి విషయాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ...పర్యటన విశేషాలను వెల్లడించారు. తన పర్యటనలో భాగంగా 25 దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఉన్నతాధికారులతో సమావేశాలు జరిపి, రెండు ఒప్పందాలు చేసుకున్నామని, ఒక లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ తీసుకున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన కియ పరిశ్రమ వల్ల రూ.12915 కోట్ల(2 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల) పెట్టుబడి వస్తుందని, ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని సీఎం తెలిపారు. కియ మోటార్స్‌కు భూమి, నీరు, అనుమతులు అత్యంత వేగంగా ఇవ్వడం కొరియా పారిశ్రామికవేత్తలను ఆశ్చర్యపరిచిందన్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.8 వేల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి వచ్చేలా చేయగలిగామని సీఎం పేర్కొన్నారు.