పవన్ కళ్యాణ్ ను రాయలసీమలో అడుగుపెట్టనివ్వం

SMTV Desk 2017-05-27 14:05:08  pawankalyan,janasena,rayalasima rastrasamithi,bicote rayalseema

హైదరాబాద్, మే 25 : పవన్ కళ్యాణ్ కు రాయలసీమతో ఏమాత్రం పనిలేదని... ఇక్కడ అడుగుపెట్టనివ్వమని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కుంచం వెంకట సుబ్బారెడ్డి ఘాటుగా హెచ్చరించారు. కనుమరుగవుతున్న తమ ఉనికిని తెలియజేసేందుకే ఎప్పుడు పడితే అప్పుడు వివిధ విషయాలపై మాట్లాడుతూ ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. తన అన్న పార్టీ పెట్టి అనతి కాలంలోనే అమ్మకానికి పెట్టారని.. పవన్ కళ్యాణ్ తన పార్టీని అదే దారిలో నడిపిస్తాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటి చేయాలనుకుంటే కోస్తాంధ్రలో పోటి చేయాలని.. రాయలసీమలో మాత్రం అడుపెట్టనివ్వమని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. పరిటాల రవితో పవన్ కళ్యాణ్ విభేదాల నేపధ్యంలో రాయలసీమపై దృష్టి సారించిన ఆయన హెచ్చరికలతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ నేతృత్వం లోని జనసేన కార్యక్రమాలు ఉధృతం అయ్యాయి. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ఆ పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు బాధ్యులను ఎంపిక చేసి ముందు నుండి క్రమశిక్షణ, చిత్తశుద్ది, ధృడసంకల్పంతో పార్టీని ముందుకు నడిపించేందుకు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాన నాయకులు సమాయుత్తం అయ్యారు. ఇటీవల తెలంగాణాకు సంబంధించి ఉద్యోగ నియామకాల తరహాలో బాధ్యుల ఎంపిక ప్రక్రియ చేపట్టడం ఇందుకు ఊతం ఇస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఉన్న సినిమా అభిమానుల ఫాలోయింగ్ తో పాటు జనంలోను మంచి క్రేజ్ కొనసాగుతున్న దరిమిలా, రెండు రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీ కీలక పాత్ర వహించే అవకాశం ఉంది. ఇక చిరంజీవి విషయానికొస్తే 2007లో ప్రజారాజ్యం పార్టీని అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే ప్రజాదరణ కోల్పోయి... చివరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆ పార్టి ప్రతిష్ట కనుమరుగు కావడానికి కారణం నాయకత్వ లోపమేనన్న విషయం సుస్పష్టం అయ్యింది. ఆ దరిమిలా నేర్చుకున్న పాఠాలతో పాటు డైనమిక్ గా వ్యవహరించే పవన్ కళ్యాణ్ కు మాత్రం జననీరాజనాలు పెద్దఎత్తున లభిస్తాయన్న ఆశాభావం వ్యక్తం అవుతున్నది.