పోలవరంపై ప్రభుత్వ చిత్తశుద్దిని శంకిచవద్దు: చంద్రబాబు

SMTV Desk 2017-12-07 16:11:18  chandrababu, polavaram, amaravati updates, ycp, janasena

అమరావతి, డిసెంబర్ 07: మూడురోజుల దక్షిణకొరియా పర్యటన ముగించుకుని బుధవారం రాత్రి విజయవాడ చేరుకున్న చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గురువారం వైసీపీ నాయకులు పోలవరం బస్సుయాత్ర, అదేరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోలవరం సందర్శించనున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి దీనిపై స్పందించారు. పోలవరం ప్రాజెక్టు విషయంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఎక్కడా రాజీ పడకుండా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పనులు చేస్తున్నామని తెలిపారు. ఏ విధంగా చేస్తే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందన్న దానిపై వారానికొకసారి అధికారులతో సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు ఆగే ప్రసక్తే లేదని చంద్రబాబు వివరించారు. పవన్‌కల్యాణ్‌ పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తుంటే, వైకాపా ఎలా అడ్డుకోవాలా అని చూస్తోందని ఆయన విమర్శించారు.