దేశంలోనే మొదటి ప్రొటోటైప్ డిజైన్ సెంటర్ టీ వర్క్స్‌:కేటీఆర్

SMTV Desk 2017-12-06 15:38:15  t works, cii-nid, hicc, ktr, telangana

హైదరాబాద్, డిసెంబర్ 06: టీ-హబ్ తో వినూత్న ఆవిష్కరణలకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్దది, దేశంలోనే ప్రప్రథమ డిజైన్ సెంటర్ టీ వర్క్స్‌ను వచ్చే ఏడాది డిసెంబర్‌లోపు హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హెచ్‌ఐసీసీలో మంగళవారం సీఐఐ-ఎన్‌ఐడీ ఇండియా డిజైన్ సమ్మిట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ సుమారు 20 మిలియన్ డాలర్ల వ్యయంతో, 2.5 లక్షల చదరపు అడుగుల్లో టీ వర్క్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం హార్డ్‌వేర్ పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉన్నదన్న ఆయన ప్రపంచం నుంచి స్ఫూర్తి పొంది, స్థానిక అవసరాలకు తగ్గట్టుగా టీ వర్క్స్ ను రూపొందిస్తామన్నారు. స్కూలు, కాలేజీ స్టూడెంట్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త.. ఇలా ఎవరైనా సృజనాత్మక ఉంటే టీ వర్క్స్‌ద్వారా తప్పకుండా ప్రోత్సహిస్తామన్నారు. ఏదో ఒక్క రంగానికే టీ వర్క్స్ పరిమితం కాదని, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, డిఫెన్స్, కన్జ్యూమర్‌గూడ్స్, గ్యాడ్జెట్లు, సెమీ కండక్టర్స్‌వంటి రంగాలకు అన్నివిధాల డిజైన్లను అందించేలా ఉంటుందని తెలిపారు. ఐవోటీ, ఏవియానిక్స్, డ్రోన్స్, టెలికం, మొబైల్, సెన్సర్లు వంటి వాటిలో సరికొత్త డిజైన్ల ఆవిష్కరణకు అవకాశం కల్పిస్తామని కేటీఆర్ వివరించారు.