తొలిస్థానంలో ఒబామా ట్వీట్‌

SMTV Desk 2017-12-06 15:34:32  Twitter, twit, Obama, america, modi

శాన్‌ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 06: ప్రపంచం నలుమూలల్లో ఇటీవలి కాలంలో ట్విట్టర్ ను ఎక్కువగా ప్రేరేపిస్తుంటారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం తొలిస్థానంలో ఉన్నారు. కానీ ట్వీట్ల విషయంలో మాత్రం మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను ఆయన మించలేకపోయారు. ఈ ఏడాది మొత్తంలో ఎక్కువ మంది ఇష్టపడిన ట్వీట్‌ ఒబామావెనట. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్‌ సంస్థ వెల్లడించింది. ఆగస్టులో వర్జీనియాలోని ఛార్లెట్స్‌విల్లేలో పెద్దఎత్తున జాతివిద్వేష ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన జరిగిన అనంతరం ఒబామా తన వ్యక్తిగత ట్విటర్‌ ద్వారా ఓ పోస్టు చేశారు. నెల్సన్‌ మండేలా సూక్తుల్లో ఒకటైన ‘శరీర ఛాయ, మతం, నేపథ్యం కారణంగా ఎవరూ మరొకరిని ద్వేషించరని ఆయన ట్వీట్‌ చేశారు. దాంతో పాటు కిటికీ వద్ద ఉన్న చిన్నారులను సంతోషంగా పలకరిస్తున్న ఫొటోను ఆయన పోస్టు చేశారు. ఈ ట్వీట్‌ ఈ ఏడాది ఎక్కువ మంది ఇష్టపడిన ట్వీట్‌గా ప్రధమస్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఈ ట్వీట్‌కు 4.6మిలియన్ల లైక్‌లు రావడంతో పాటు, ఎక్కువ మంది రీట్వీట్‌ చేసిన ట్వీట్ల జాబితాలోనూ ఇది రెండోస్థానంలో ఉంది. ఇక అత్యధిక మంది అనుసరిస్తున్న భారతీయుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిస్థానంలో ఉన్నారు. ఆయన ట్విటర్‌ ఖాతాను 3.75కోట్ల మంది అనుసరిస్తున్నట్లు సమాచారం.