అనర్హత పిటిషన్లకు మూడు నెలల్లో ముగింపు పలకాలి: ఉపరాష్ట్రపతి

SMTV Desk 2017-12-06 11:04:05  vice president, disqualify, sharad yadav, venkaiah naidu

న్యూ డిల్లీ, డిసెంబర్ 06: పార్టీ ఫిరాయింపులు రోజురోజుకు పెరిగి పోతున్న తరుణంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీ(యు) సీనియర్ సభ్యులు శరద్‌యాదవ్‌, అలీ అన్వర్‌ అన్సారీలను పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ కింద సభ్యుల అనర్హతలపై దాఖలు చేసిన పిటిషన్లపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల మూలంగా చట్టసభలు, సభాపతిపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతు౦దని, దీనిపై సభాపతులు చట్టప్రకారం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని, విమర్శలకు అవకాశం ఇవ్వవద్దని ఆయన సూచించారు. చట్టప్రకారం వాదన చెప్పుకునే అవకాశం సభ్యులకు ఇచ్చి మూడునెలల్లో నిర్ణయం తీసుకోవటం వల్ల రాజకీయ ఫిరాయింపుల జాఢ్యాన్ని సమర్థవంతంగా అరికట్టడానికి వీలవుతుంది. ఈ రెండు కేసుల్లో వాద, ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఇద్దరిపై అనర్హత వేటు వేస్తున్నానని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజ్యసభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని, ఈ విషయాన్ని సభాహక్కుల సంఘానికి నివేదించి ఉండాల్సిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.