నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థులపై వీడని ఉత్కంఠ!

SMTV Desk 2017-06-15 14:10:18  TDP MLA Bhooma Nagireddy,Nandyala constitution,Shilpa Mohan Reddy,YSRCP

అమరావతి, జూన్ 15 : ఇటీవల జరిగిన తెదేపా శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఆయన ప్రాతినిద్యం వహించిన నంద్యాల నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక జరపాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికల్లో అధికార తెదేపా తరఫున పోటీ చేసేందుకు కొద్ది రోజుల క్రితం వరకు గట్టిగా పోరాడిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి బుధవారం వైకాపాలో చేరడంతో రాజకీయాలు ఉత్కంఠను ప్రదర్శిస్తున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ తరఫున భూమా నాగిరెడ్డి వారసుడుగా భూమా బ్రహ్మానందరెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రహ్మానందరెడ్డికి తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తదితరులు మద్దతుగా నిలిచేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారంటున్నారు. నంద్యాలలో ముస్లింలు, తర్వాత బలంగా మరో రెండు సామాజికవర్గాలకు ఈ నేతలు ప్రతినిధులుగా ఉన్నారు. వీరు మద్దతుగా నిలిస్తే ఆయా సామాజికవర్గాల ఓట్లు పొందవచ్చన్న భావన తెదేపా వర్గాల్లో ఉంది. మరోవైపు వైకాపా నేత కాటసాని రామిరెడ్డికి భూమా బ్రహ్మానందరెడ్డి అల్లుడు కూడా. ఈ నేపథ్యంలో రామిరెడ్డి మద్దతు బ్రహ్మానందరెడ్డికి ఉంటుందన్న ప్రచారం ఉంది. ప్రతిపక్ష వైకాపాలో శిల్పా మోహన్ రెడ్డి చేరికతో... ఇప్పటికే నంద్యాలలో ఆ పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి, ఆయన వర్గం అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. ఈ నెల 19న కార్యకర్తలతో పెద్దఎత్తున వాహనాల్లో హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వెళ్లి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైకాపాకు నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రస్తుతం ఎవరూ లేనందున ఆ స్థానాన్ని శిల్పా మోహన్‌రెడ్డికి అప్పగిస్తారని, ఇప్పుడు ఆయనకు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని రాజగోపాలరెడ్డి వర్గం గట్టిగా వాదిస్తోంది.