ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్

SMTV Desk 2017-06-15 14:07:27   Iftar feast, CM KCR, Joint governor ESL Narasimhan,Raj Bhavan

హైదరాబాద్, జూన్ 15 : రంజాన్ ఉపవాసాల సందర్భంగా బుధవారం తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా రాజ్‌భవన్ దర్బార్‌హాల్లో నిర్వహించిన ముస్లిం పెద్దల దువా (ఆశీర్వాదం) కార్యక్రమంలో గవర్నర్, సీఎం, పలువురు మంత్రులు పాల్గొన్నారు. విందులో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మాజీ గవర్నర్ రోశయ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందుకు హాజరైన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులు మీరు ఉప రాష్ట్రపతి రేసులో ఉన్నారా.. అని అడుగగా.. అంతా పైవాడి దయ.. మీరే రాస్తున్నారు. నాకేం తెలియదు అని సమాధానమిచ్చారు కెసిఆర్. అధికారపక్షంతోపాటు ప్రతిపక్షాలకు కూడా అందుబాటులో ఉంటున్నానని, పక్షపాతానికి తావులేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో ఉండటం వల్ల ఈ విందుకు హాజరుకలేకపోయ్యారు. గవర్నర్ స్వయంగా అథితులను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు.