టెలీ కాన్ఫరెన్స్‌ లో సూచనలు చేసిన సీఎం చంద్రబాబు

SMTV Desk 2017-12-03 12:01:14  Telly Conference, cm chandrababu naidu, References, TDP Leaders

అమరావతి, డిసెంబర్ 03 : నేడు కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళన, మంజునాథ్‌ వివాదంపై నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు. చాలాకాలంగా ఉన్న డిమాండ్‌ను నేరవేర్చామని, ఇచ్చిన మాటకు కట్టుబడ్డామని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లలో కోత పెట్టకుండానే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని గతంలో చెప్పినట్లుగానే, ఇప్పుడు చేసి చూపించామన్నారు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై నేతలతో సమన్వయం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌కు బాధ్యతలు అప్పగించారు. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఇలా చేస్తున్నారని, దీనిపట్ల టీడీపీ నేతలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన వెల్లడించారు.