సంకల్పం ముందు ఓడిన వైకల్యం...

SMTV Desk 2017-12-02 11:34:41  gireesha, joint collector, chittoor, ias, success

చిత్తూర్, డిసెంబర్ 02: సంకల్ప బలం ముందు ఎంతటి లక్ష్యమైన తలొగ్గాల్సిందేనని నిరూపించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన గిరీశా. ఓ నలభై ఇళ్లు ఉండే చిన్న పల్లెటూరులో కూలీ పని చేసుకునే తల్లిదండ్రులు.. సర్కారు బడిలో చదువు సాగిస్తున్న అతనిని విధి ఎక్కిరించింది. ఒక రోజు ఇంటి పనులు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ కొట్టి రెండు చేతులు స్పర్శ కోల్పోగా, కుడి చేయి తొలగించాల్సి వచ్చింది. ఇక ఎడమచెయ్యి ఒక్కటే మిగిలింది. పదో తరగతి పరీక్షలు సహాయకుడితో రాయించి గట్టెక్కాడు. ఆ బాధ కంటే.. పెన్ను పట్టుకుని రాసే కుడిచేయి లేదన్న బాధ అతనిని కుంగదీసింది. ఇంటర్‌లో కష్టపడి ఎడమచేత్తోనే పరీక్షలన్నీ రాసి పాస్ అయ్యారు. జీవితంలో అవసరం అన్నీ నేర్పిస్తుందని గిరీశా తెలిపారు. వైద్యుడిగా స్థిరపడాలన్న కోరిక వల్ల పట్టుదలతో వైద్య ప్రవేశపరీక్ష రాసి మైసూర్‌లో ఎంబీబీఎస్‌లో సీటు సంపాదించి, ఒంటి చేత్తో వైద్యం సాధ్యం కాదని తెలిసి వదులుకున్నాడు. ప్రభుత్వం అందించే ఐదొందల రూపాయల పింఛను వాడుకుంటూ చదివి 2010లో సివిల్స్‌ మొదటి ప్రయత్నంలోనే ఇండియన్‌ రైల్వే సర్వీస్‌కు ఎంపికయ్యాడు. మూడో ప్రయత్నంగా 2012లో ఐఏఎస్‌ వరించగా తొలి పోస్టింగ్‌ నెల్లూరు జిల్లా గూడూరులో వచ్చింది. ఇప్పుడు చిత్తూరు జిల్లా జేసీగా రెండో పోస్టింగ్‌ వచ్చింది. నేను పడిన ఇబ్బంది మరొకరు పడకూడదు. నిజాయితీగా పనిచేస్తూ పేద ప్రజలకు ప్రభుత్వం తరపున సేవ చేయడమే తన లక్ష్యమని గిరిశా తెలిపారు. వైకల్యాన్ని ఓడించిన గిరీశా విజయం నేటి యువతకు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం.