ఏమైనా టీడీపీలోనే ఉంటా: ఎంపీ కేశినేని

SMTV Desk 2017-06-14 15:36:35  vijayawada,MP keshineni Nani,Arunachal Pradesh,TDP

విజయవాడ, జూన్‌ 13: విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీగా ఉన్నా, లేకపోయినా టీడీపీలో ఉంటానన్నారు. పార్లమెంటు సభ్యుడిగా దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నానని, విజయవాడలో4 వేల కోట్లతో అభివృద్ధి జరుగుతోందని, టాటా ఫౌండేషన్ వంటి సంస్థను తీసుకొచ్చి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేయిస్తున్నామని ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా తిరుగుతున్న బస్సులను అడ్డుకోవడంలో అధికారుల వైఫల్యం వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని నాని విమర్శించారు. ఈ బస్సుల రవాణాపై కొన్ని రోజులుగా నాని పోరాడుతున్నారు. ఈ క్రమంలో... అరుణాచల్‌ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్లు చేయించి ఏపీలో స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న 900 ప్రైవేటు బస్సులకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది ఏపీ ప్రభుత్వం. అయితే, నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఆయన మంగళవారం స్పందిస్తూ అక్రమంగా తిరుగుతున్న బస్సుల విషయాన్ని అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు సరిగ్గా పట్టించుకోలేదన్నారు. పైగా తాను వీరంగం వేశానని అధికారులు ప్రచారం చేశారన్నారు. అక్రమ బస్సుల వ్యవహారంపై పార్లమెంటులో చర్చ జరిగి, కొంతమంది ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదుపై అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం స్పందించి అక్రమ బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసిందన్నారు. దాదాపు మూడువేల బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దుచేయగా అందులో 900 బస్సులు ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయని అన్నారు. బాధ్యత గల ఎంపీగా నా అధినేతకు, ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఇతర రాష్ట్రాలలో కూడా మంచి పేరు ఉందని, అధికారులు చేసే తప్పిదాలవల్ల మా పార్టీ అప్రతిష్ఠపాలు కాకూడదన్నారు.