మెట్రో రైలు సంబరంలో.... ట్రాఫిక్ సమస్యలు

SMTV Desk 2017-11-30 12:02:19  metro train, hyderabad, traffic

హైదరాబాద్, నవంబర్ 30 : మెట్రో ప్రారంభమై రెండు రోజులు అవుతున్న తరుణంలో నగర వాసులు ఈ మెట్రో రైలును ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. సరదాగా అలా ఓ రౌండ్ వేసి వద్దామని, బైక్ పార్క్ చేసి, రైల్లో కాసేపు విహరించి వచ్చిన తరువాత చూస్తే వాహనాలు కనిపించక పోవడంతో మెట్రో సిబ్బందిపై వాదనలకు దిగుతున్నారు. అయితే, మెట్రో స్టేషన్లలో ఇప్పటివరకూ వాహన పార్కింగ్ ఏర్పాట్లు ఎక్కడా జరగలేదన్న విషయం తెలిసిందే. దీంతో పలువురు తమ వాహనాలను మెట్రో కారిడార్లలో, రోడ్ల మధ్యన, మెట్ల కింద పార్క్ చేసి ఎంచక్కా రైలెక్కి పోతుండడంతో, ఈ ఉదయం నుంచి అమీర్ పేట, బేగంపేట, ఎస్ ఆర్ నగర్ స్టేషన్లలో ఈ సమస్య అధికంగా ఉండటంతో, ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, అనధికారికంగా పార్కింగ్ చేసిన టూవీలర్లను సమీప పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. పార్క్ చేసిన తమ వాహనాలు పోయాయని పదుల సంఖ్యలో హైదరాబాదీలు పోలీసులకు చెబుతున్నారు. ఇప్పటివరకూ పోలీసులు 100కు పైగా బైకులను తరలించాల్సి వచ్చిందని, తొలి తప్పుగా వారిపై జరిమానాలు లేకుండానే వాహనాలను అప్పగించే అవకాశాలు పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు.