కృత్రిమ రక్తనాళాలతో దంతాలకు పునర్జీవనం!

SMTV Desk 2017-06-14 14:28:43  Artificial blood vessels,Resurrected tooth, Bertasoni

వాషింగ్టన్, జూన్ 14 : దంత చికిత్సల్లో మెరుగైన విధానాల కోసం అన్వేషిస్తున్న పరిశోధకులు తాము సృష్టించిన కృత్రిమ రక్తనాళాలతో రూట్ కెనాల్ చికిత్స వల్ల దంతానికి కలుగుతున్న నష్టాన్ని నివారించి దాని జీవన కాలాన్ని పెంచగాలిగారు. ఇన్ఫెక్షన్ కు గురైన లేదా దెబ్బతిన్న దంతాలను ప్రస్తుతం చేస్తున్న రూట్ కెనాల్ చికిత్సలో దంత కణజాలన్ని తొలగించి సింథటిక్ బయోమెటీరియల్స్ తో పూనః స్థాపన చేసి, దానికి రక్షణగా ఒక తొడుగు వేస్తారు. ఈ విధానంలో దంతాల్లోని రక్త నాళాలు తొలగింపునకు గురవుతాయి. దీని వల్ల దీర్ఘకాలంలో దంతం పెళుసుబారి, కొంత కాలానికి అది విరిగిపోయి ఇబ్బంది పెట్టే పరిస్టితి వస్తుందని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ లూయిజ్ బెర్తాసోని తెలిపారు. దీనిని నివారించేందుకు గతంలో తాము 3డీ ప్రింటింగ్ విధానం ఆధారంగా కృత్రిమ కేశ నాళికలను తయారు చేసిన అనుభవాన్ని ఉపయోగించుకుని కృత్రిమ రక్తనాళాలను రూపొందించామని లూయిజ్ బెర్తాసోని వెల్లడించారు. రూట్ కెనాల్ చుట్టూ చక్కెర అణువులతో కూడిన ఫైబర్ మోల్డ్ ను ఉంచి, శరీరంలో ఉంటే ప్రోటీన్లను పోలిన జెల్ ను దంతంలోకి ఇంజెక్ట్ చేశామన్నారు. ఈ తర్వాత ఫైబర్ ను తొలగించి.. రక్తనాళాల అంతర్గత గోడల నుంచి వేరుపరచిన ఎండోథీలియల్ కణాలను చోపించామన్నారు. వారం రోజుల తర్వాత దంతం లోపల కృత్రిమ రక్తనాళాలు తయారయ్యాయని తెలిపారు. ఈ విధానం దెబ్బతిన్న దంతాన్ని పూర్తిస్థాయిలో పనిచేసేలా చేయవచ్చని నిరూపిస్తోందని బెర్తాసోని అభిప్రాయపడ్డారు.