2020 నాటికి 500 మిలియన్‌ ఖాతాల లక్ష్యం

SMTV Desk 2017-11-29 15:13:10  Paytm, bank account, Finance Minister Arun Jaitley, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 29 : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం ఢిల్లీలో ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకును అధికారికంగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్‌ బ్యాంకును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంపద నిర్వహణ నుంచి క్రెడిట్‌ కార్డ్స్‌, స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ వరకూ ఇలా అన్నింటికీ ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌గా మారాలని ఆ సంస్థ భావిస్తోంది. రానున్న మూడు సంవత్సరాల లోపు 500 మిలియన్‌ ఖాతాలను పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది. జీరో బ్యాలెన్స్‌తో, ఆన్‌లైన్‌ లావాదేవీలకు ఎలాంటి రుసుము లేకుండా ఈ సేవలను తీసుకువచ్చినట్లు ఆ సంస్థ పేర్కొంది. పొదుపు ఖాతాపై వడ్డీని కూడా అందజేయనున్నట్లు.. ఖాతాదారులు తమ డబ్బును ఏ ఏటీఎం కేంద్రం నుంచైనా డ్రా చేసుకోవచ్చని తెలిపింది. బ్యాంకు సేవలు అందని వారిని లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సంస్థ పేర్కొంది. డిజిటల్‌ చెల్లింపుల బ్యాంక్‌ అనేది మా ఎంట్రీ పాయింట్‌ మాత్రమే.. సమీకృత ఆర్థిక సేవల సంస్థగా మేం మారాలనుకుంటున్నామని, పేటీఎం వ్యవస్థాపకులు విజయ్‌ శంకర్‌ శర్మ తెలిపారు.