అకస్మాత్తుగా రంగు మారిన నీరు

SMTV Desk 2017-11-29 14:47:42  Siang River in Arunachal Pradesh, water co lour change

న్యూఢిల్లీ, నవంబర్ 29 : ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ నదిలో ప్రవహిస్తున్న నీరు అకస్మాత్తుగా నలుపు రంగులోకి మారడంతో చాలా చేపలు మృత్యువాత పడ్డాయి. గతంలో ఎన్నడూ సియాంగ్‌ నదిలో నీరు ఇలా రంగు మారినట్లు కనిపించపోవడంతో, ఈ నీటిపై ఈస్ట్‌ సియాంగ్‌ జిల్లా అధికారులు పరీక్షలు చేపట్టారు. నీరు మొత్తం నలుపు రంగులోకి మారిపోయి.. అందులో నుంచి సిమెంటు వంటి బూడిద పదార్థం వస్తోందని అక్కడి డిప్యూటీ కమిషనర్‌ తమయో తతక్‌ తెలిపారు. ‘ఈ నీరు తాగేందుకు లేదా ఇతర పనులను ఉపయోగించుకునేందుకు అనువుగా లేదు. ఎందుకంటే ఇందులో సిమెంటు వంటి మందపాటి పదార్థం నీటిలో తెట్టలుగా తేలుతోంది. సాధారణంగా నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఈ నదిలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే వరదలతో నీరు రంగు మారింది. కానీ వర్షాకాలం ముగిసినప్పటికీ నీటి రంగు మామూలు స్థితికి చేరలేదని తతక్‌ చెప్పుకొచ్చారు. నదిలో నీరు రంగు మారడానికి చైనానే కారణమని ఆయన చెబుతున్నారు. ‘నదికి ఎగువభాగంలో చైనా పెద్దఎత్తున నిర్మాణ పనులు, బోరింగ్‌ పనులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే నదిలోకి భారీగా సిమెంటు వంటి పదార్థం వచ్చి చేరుతోంది. నిర్మాణపనుల కోసం సిమెంటు భారీ ఎత్తున ఉపయోగిస్తుండటంతో అది నదిలో కలిసినట్లు’ తతక్‌ అనుమానిస్తున్నారు. నదిలోని నీటి శాంపిల్స్‌ను కేంద్ర నీటిపారుదల కమిషన్‌ అధికారులు తీసుకొని పరీక్షిస్తున్నారు. సదరన్‌ టిబెట్‌ మీదుగా దాదాపు 1600కిమీ పాటు ఈ నదీ జలాలు ప్రవహిస్తాయి. బ్రహ్మపుత్ర నదీజలాలను మొత్తం తానే వాడుకునేలా చైనా పన్నాగాలు పన్నుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెయ్యి కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని తవ్వాలని ఆ దేశం యోచించింది. ఆ వార్తలను చైనా ఖండించింది. సొరంగం తవ్వే ఆలోచనలేమీ తమకు లేవని నమ్మబలికింది. సొరంగ మార్గం నిర్మాణానికి అంతా రంగం సిద్ధమైందనే విషయం ఇటీవల బయటకు వచ్చింది.