ఎడ్ సెట్ కు కొత్త నిబంధనలు

SMTV Desk 2017-05-28 18:06:37  telangana,national council for teacher education

హైదరాబాద్, మే 27 : ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమితులవడానికి కావలసిన అర్హతల్లో ముఖ్యంగా బీఈడీ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకుగాను ముందుగా ప్రవేశ పరీక్ష (ఎడ్ సెట్) రాయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి రంగం సిద్దమైంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆచార్య శనివారం రోజున జారీ చేసారు. ఎన్ సి టీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) నియమాల ప్రకారం ఎడ్ సెట్ ను నిర్వహించడానికి కొత్త నియమాలను ప్రవేశ పెట్టడం జరిగింది. అవి ఏమిటంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ(10+2+3)లో కనీసం 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసి అభ్యర్థులకు కనీసం 40 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతేకాకుండా గ్రాడ్యుయేషన్ లేకుండా నేరుగా పీజీ చేసిన వారికి ఎడ్ సెట్ రాసే అవకాశం లేదని , ఈ పరీక్షకు పోటీ పడేందుకు జూలై ఒకటో తేది నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలని, గరిష్ట వయో పరిమితి ఏమీ లేదని రంజీవ్ ఆచార్య ప్రకటించారు. # ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరన: ఎడ్ సెట్ 2017 రాయబోయే అభ్యర్థులు ఆన్ లైన్లోనే దరఖాస్తులు చేసుకోవాలని, ఎడ్ సెట్ లో వచ్చిన మార్కుల మెరిట్ జాబితాను కమ్యూనిటి వారిగా, రిజర్వేషన్ల ప్రాతిపదికన, ప్రాంతాలవారీగా సిద్దం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. # విషయాల వారిగా సీట్ల భర్తీ: ఎడ్ సెట్ పరీక్షకు పాఠశాలలో బోధించే వివిధ విషయాల వారిగా సీట్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో గణితంలో 25 శాతం, భౌతిక, జీవశాస్త్రాల్లో 30 శాతం(కనీసం పదిశాతం, గరిష్టం 20 శాతం) ప్రాతిపదికన మెథడాలజీకి సీట్లు కేటాయించింది. సాంఘిక, ఇంగ్లీష్ మెథడాలజిలకు 45 శాతం సీట్లు కేటాయించాలని సూచించింది. ఎడ్ సెట్ నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ఉన్నత విద్యామండలికి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో చెప్పడంతో త్వరలోనే ఎడ్ సెట్ వివరాల జాబితాను ప్రకటిస్తామని మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు.