డిసెంబరులో కార్టోశాట్‌-2 ప్రయోగం: ఇస్రో

SMTV Desk 2017-11-29 11:48:50   cartosat 2, isro, kiran kumar, launch

బెంగళూరు, నవంబర్ 29: ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్దమవుతుంది. అంతరిక్షంలో అత్యంత సమర్థంగా ఛాయా చిత్రాలు తీయగలిగిన కార్టోశాట్‌-2 ఉపగ్రహాన్ని డిసెంబరు నెలాఖరున ప్రయోగించే అవకాశాలున్నట్లు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధ్యక్షులు ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ తెలిపారు. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక వస్తు సంగ్రహాలయం(వీఐటీఎం)లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇస్రో గ్యాలరీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. "గత ఆగస్టులో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1హెచ్‌ ఉప్రగహ వైఫల్యం తర్వాత ఇస్రో చేపట్టే ప్రయోగం కార్టోశాట్‌ కాబోతుంది. టీడీఐ (టైమ్‌ డిలే ఇంటరాగేషన్‌) విధానంతో పని చేసే ప్యాంక్రోమేటిక్‌, మల్టీ స్పెక్ట్రమ్‌ కెమెరాలను తీసుకెళ్లే ఈ ఉపగ్రహం ప్రామాణికమైన డేటాను అందించగలదు. పార్లమెంట్‌లో చర్చించబోయే అంతరిక్ష కార్యకలాపాల ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నాం.. దీనిద్వారా భారతీయ అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి మార్గం సుగమం అవుతుంది" అన్నారు.