అవకాశాలు అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి : ఇవాంకా

SMTV Desk 2017-11-29 11:31:21  2 nd day of ges meeting, ivanka trump, icici ceo chanda kocchar, ktr.

హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో రెండో రోజు "మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు" అంశంపై ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాంకా మాట్లాడుతూ.. "సాంకేతిక విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలున్నాయి. మహిళలు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకునేందుకు వారు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు సాంకేతికత ఎన్నో అవకాశాలను అందిస్తోంది. ఏ రంగంలోనైనా సేవలు బాగుంటేనే ఆదరణ ఉంటుంది" అని తెలిపారు. ఈ సదస్సులో బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ భార్య చెర్రీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎండీ చందా కొచ్చర్‌, డెల్‌ ఈఎంసీ కరేన్‌ క్వింటోస్‌ పాల్గొన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సులో పాల్గొన్న పలువురు ఈ విధంగా స్పందించారు. *"భారత్‌ లాంటి దేశాల్లో మహిళా భాగస్వామ్యం ఉంటేనే వృద్ధి సాధ్యమవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థకు మహిళా శక్తి ఎంతో అవసరం. కుటుంబం నిర్వహణలో మహిళలు సమర్థంగా వ్యవహరిస్తున్నారు” -చెర్రీ * “మహిళలు బిడ్డకు జన్మనిచ్చే సమయంలో కెరీర్‌ను వదులుకుంటున్నారు. సాంకేతికతను వినియోగించి ఇంటి నుంచి పనిచేసే అవకాశాలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి మరిన్ని శిక్షణా కేంద్రాలు అవసరం” - చందా కొచ్చర్‌ * “కాలానుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు తీసుకురావాలి. సాంకేతకత రోజురోజుకూ మరింత స్మార్ట్‌గా మారుతోంది” - కరేన్‌ క్వింటోస్‌