గూగుల్ వల్ల గురువును విస్మరించవద్దు: వెంకయ్యనాయుడు

SMTV Desk 2017-11-29 10:33:54  venkaiah naidu, vit, amaravati, chandrababu

అమరావతి, నవంబర్ 29: విద్యాభ్యాసంలో తరగతి గది తరగని నిధిగా మారాలని, ప్రతి ఒక్కరిలో అంతర్లీనమైన ప్రతిభ ఉంటుందని దానికి సానపెడితే అద్భుతాలు సృష్టించే శక్తి సామర్థ్యాలు భారతీయుల్లో ఉన్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయడు పేర్కొన్నారు. అమరావతి రాజధాని పరిధిలోని ఐనవోలులో నిర్మించిన వేలూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌) యూనివర్సిటీ భవనాలను వెంకయ్యనాయుడు మంగళవారం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించగా, వసతి గృహ భవనాలను సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రానున్న కాలంలో అమరావతి రాజధాని ప్రపంచంలోనే ఒక గొప్ప విజ్ఞాన కేంద్రంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దక్షిణ భారత దేశంలో పేరెన్నికగన్న విట్‌ యూనివర్సిటీ అమరావతిలో ఏర్పాటు కావడం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ప్రతి విద్యార్థీ గురువుపై భక్తికలిగి ఉండాలని, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడాలని సూచించారు. గుగూల్‌ వల్ల గురువును విస్మరించరాదన్నారు. ఉద్యోగం రాకపోయినా విజ్ఞానం కోసం ప్రతి ఒక్కరూ చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాల నిర్వహణకు అమరావతిలో విదేశాంగ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్‌ అంగీకరించారని వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు ముంబైలో మాత్రమే ఉన్న ఈ కార్యాలయం దక్షిణాది రాష్ట్రం అమరావతిలో ఏర్పాటవుతుందని తెలిపారు. విద్యాలయాలకు సమీపంలో ప్రశాంత వాతావరణం ఉండాలని శబ్దకాలుష్యం ఉండరాదని, బార్‌లు, రెస్టారెంట్లకు అనుమతి ఇవ్వొద్దని ఆయన సూచించారు. సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్లతో రాజధానిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని, రోడ్ల నిర్మాణం వేగవంతమైందని చెప్పారు.