ఉగ్రవాదాన్ని పెకిలించుదాం: భారత్‌-రష్యా

SMTV Desk 2017-11-28 10:35:10  terrorism, india, russia, agreement

మాస్కో, నవంబర్ 28: భారత్ కు ఉన్న సన్నిహిత మిత్రుల్లో రష్యా ప్రముఖమైనది. కాగా ఉగ్రవాదం పై పోరుకు సంబంధించి ఓ కీలక ఒప్పందంపై భారత్‌-రష్యా సంతకాలు చేశాయి. ఉగ్రవాదుల్లో మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులు అనే భేదాలు ఉండవని భారత్‌, రష్యా ఉద్ఘాటించాయి. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా తుదముట్టించాలని తీర్మానించుకున్నాయి. ఈ మేరకు ఉమ్మడి పోరాటం సాగించేందుకు వీలుగా కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రష్యా పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రి వ్లాదిమిర్‌ కొలొకోల్‌త్సేవ్‌ ఈ ఒప్పందంపై మాస్కోలో సోమవారం సంతకాలు చేశారు. అంతకుముందు వారిద్దరూ పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. భారత్‌, రష్యా ద్వైపాక్షిక సంబంధాల్లో భద్రతారంగం అత్యంత కీలకమైనదని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రష్యా తమకు సహజ మిత్ర దేశం అని రాజ్‌నాథ్‌ ఉద్ఘాటించారు.