ఫ్లిప్‌కార్ట్‌ సంస్థపై కేసు నమోదు

SMTV Desk 2017-11-27 16:49:37  FLIP KART, CHEATING CASE, BINNY BHANSAL, SACHIN BHANSAL,

బెంగుళూరు, నవంబర్ 27 : ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ వ్యవస్థాపకులైన, సచిన్ బన్సాల్‌, బిన్నీ బన్సాల్‌ కేసులో ఇరుక్కున్నారు. బెంగుళూరుకి చెందిన నవీన్‌ కుమార్‌ అనే వ్యాపారవేత్త వీరిపై చీటింగ్ కేసును పెట్టారు. ల్యాప్‌టాప్‌లకు సంబంధించి రూ.9.96 కోట్ల బకాయిలను చెల్లించకుండా తనను మోసం చేశారంటూ అతను ఆరోపించాడు. బిగ్‌ బిలియన్‌ సేల్‌లో భాగంగా నవీన్‌ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుని 2015 నుంచి 2016 వరకు 14,000 ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు సరఫరా చేశాడు. కానీ ఫ్లిప్‌కార్ట్‌ వాటిలో 1,482 వస్తువులను వెనక్కి ఇచ్చేసి మిగతా వస్తువులకు డబ్బు చెల్లించలేదని నవీన్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. వాటికి సంబంధించిన టీడీఎస్‌, షిప్పింగ్‌ ఛార్జీలు కూడా చెల్లించలేదని వాపోయాడు. వీటి గురించి అడిగితే అన్ని వస్తువులు వెనక్కి ఇచ్చేశామని, ఇక ఎలాంటి బాకీలు లేవని బన్సల్‌ సోదరులు వాదించినట్లు నవీన్‌ ఆరోపించాడు. ఈ మేరకు వీరిపై, ఐపీసీ సెక్షన్స్‌ 34, 406, 420 కింద కేసు నమోదైంది.