చారిత్రాత్మక హైదరాబాద్‌ మెట్రోరైల్‌ తొలి ప్రయాణికుడు మోదీ...

SMTV Desk 2017-11-25 11:22:17  metro train, modi, first passenger, modi tour in hyderabad

హైదరాబాద్, నవంబర్ 25: ప్రధానమంత్రి మోదీ తెలంగాణ పర్యటనపై ఆయన కార్యాలయం అధికారిక సమగ్ర సమాచారాన్ని శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. దీని ప్రకారం ఆయన పర్యటన రాష్ట్రంలో 9.20 గంటలపాటు ఉంటుంది. 28వ తేదీ మధ్యాహ్నం 1.10కి డిల్లీ నుంచి వచ్చే ప్రధాని రాత్రి 10.30గంటలకు ఇక్కణ్నుంచి తిరుగు పయనమవుతారు. మెట్రో ప్రారంభోత్సవంలో ఆయన 25 నిమిషాలు, హెచ్‌ఐసీసీలో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో 4 గంటలు, ఫలక్‌నామా విందులో 2 గంటలు గడుపుతారు. కాగా ప్రధాని మోదీ హైదరాబాద్‌ మెట్రోరైలు తొలి ప్రయాణికుడు కానున్నారు. ఈ నెల 28న మెట్రోను ప్రారంభించి, మొదటి టికెట్‌ను ఆయనే కొనుగోలు చేయనున్నారు. తర్వాత గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు వాటిని కొంటారు. అనంతరం మంత్రులు తదితరులకు మెట్రో సిబ్బంది టికెట్లు విక్రయిస్తారు. ఇందుకు ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఏర్పాట్లు చేస్తోంది. మియాపూర్‌-కూకట్‌పల్లి స్టేషన్ల మధ్య ప్రధాని, ఇతర ప్రముఖులు రాకపోకలు సాగిస్తారు. ఆ రోజు మెట్రోరైళ్లు తిరగవు కాబట్టి, సాధారణ ప్రజలకు మరుసటి రోజు నుంచి టిక్కెట్లను విక్రయిస్తారు. మరోవైపు- మెట్రోపాస్‌ల విక్రయాన్ని ఎల్‌అండ్‌టీ అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు. ఐటీ సంస్థలు తదితర చోట్ల కియోస్కులను ఏర్పాటుచేసి, వాటిని విక్రయిస్తున్నారు. ఈ పాస్‌లలో డబ్బులు నింపుకొనే యంత్రాలు అన్ని స్టేషన్లలోనూ కొలువుదీరాయి. కాగా మెట్రో టిక్కెట్ల ధరలను మంత్రి కేటీఆర్‌ నేడు ప్రకటించనున్నారు. శనివారం నాగోలు-మెట్టుగూడ మధ్య రాష్ట్ర మంత్రులు, నగర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశారు. విలేకరులనూ వారితోపాటు తీసుకెళ్లనున్నారు. పర్యటన అనంతరం కీలక అంశాలపై కేటీఆర్‌ మాట్లాడతారనీ, ఛార్జీలను ఆయన ప్రకటిస్తారని ఓ అధికారి మీడియాకు తెలిపారు.