జస్టిస్ కర్ణన్ పదవి విరమణపై మరో రికార్డు

SMTV Desk 2017-06-13 12:11:55   Calcutta High Court, The controversial judge Justice SS Karunan, Retirement, Madras High Court,President Pranab Mukherjee

న్యూ ఢిల్లీ, జూన్ 13 : సుప్రీం ధర్మాసనం ఆదేశాల మేరకు కలకత్తా హైకోర్టుకు చెందిన వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌(62) సోమవారం పదవీ విరమణ సందర్భంగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అరెస్టును ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్‌ నిలిచిపోయారు. పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న న్యాయమూర్తిగా ఇప్పటికే పేరుపొందిన ఆయన.. కోర్టు ధిక్కారం నేరంపై సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. మే 9న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఆది నుంచి వివాదాస్పద ప్రవర్తన కారణంగా మద్రాస్‌ హైకోర్టులో పనిచేస్తున్న కర్ణన్‌ను గతేడాది మార్చి 11న కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయడంతో, ఆ ఆదేశాల్ని కర్ణన్‌ ధిక్కరించడంపై ఆయనకు ఎలాంటి విధులూ అప్పగించొద్దని మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు సుప్రీం ఆదేశాలు జారీచేసింది. తమ ఆదేశాలు పాటించనందుకు కోర్టు ధిక్కరణకేసులో తమ ముందు హాజరుకావాలంటూ ఈ ఏడాది మార్చి 10న బెయిలబుల్‌ వారంట్‌ జారీచేసింది. మార్చి 31న సుప్రీంకోర్టుకు హాజరైన కర్ణన్‌ తన అధికారాల్ని పునరుద్ధరించాలని కోరగా కోర్టు తిరస్కరించింది. తనను జైల్లో పెట్టినా బెంచ్‌ ముందు హాజరుకానని కర్ణన్‌ స్పష్టం చేయడంతో.. అతని మానసిక స్థితిపై పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. వైద్యపరీక్షలు చేయించుకోవడానికి తిరస్కరిస్తూ మే 4న కర్ణన్‌ లేఖ ఇవ్వడంతో పాటు సుప్రీం న్యాయమూర్తుల్ని అరెస్టు చేయాలంటూ తన ఇంటి నుంచే ఆదేశాలు జారీచేశారు. కోర్టు ధిక్కారనేరంపై తనను శిక్షించడం కుదరదని, విచారణపై స్టే విధించాలని మే 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం ధర్మాసనానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఊరట లభించలేదు. సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలని కర్ణన్‌ తరఫున న్యాయవాదులు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. జస్టిస్‌ కర్ణన్‌ అరెస్టుకు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌కు పశ్చిమ బెంగాల్‌ డీజీపీ సోమవారం లేఖ రాశారు. జస్టిస్ సీఎస్ కర్ణన్ పదవీ విరమణ జూన్ 12న చేసాడు. ఆ రోజు ఆయన 62వ జన్మదినం కూడా కావడం విశేషం.