శిల్పా మోహన్ రెడ్డి అడుగులు వైకాపా వైపు

SMTV Desk 2017-06-13 11:58:53  TDP Government,AP CM,Kurnool Distirict,Nandyala

కర్నూలు, జూన్ 13: అధికార తెలుగుదేశం పార్టీ నుండి నేతలకు ప్రతిసారి అవమానాలు జరగడం బాధాకరంగా ఉందని, కార్యకర్తలను వేధిస్తున్నందున ఆ పార్టీ నుండి వైదోలుగుతామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 14 వ తేదీన వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆపార్టీలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడానికి శిల్పా మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా నంద్యాలలో సోమవారం రోజున సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో భూమా నాగిరెడ్డిని చేర్చుకున్న తర్వాత పార్టీలో ఎదురైన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్ళినప్పటికి స్పందించలేదని, తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించడం లేదని ఆరోపించారు. తమ నేతలు, కార్యకర్తలను అవమానాలకు గురి చేసే పార్టీలో ఉండబోమని స్పష్టం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క మాట నిలుపుకోలేదని కార్యకర్తలు ధ్వజమెత్తారు. నంద్యాలను సీడ్ హబ్ గా మారుస్తామని మాట ఇచ్చిన సీఎం ఇప్పటి వరకు ఆ పనులను చేపట్టలేకపోయారని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాకు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసిందని హెద్దేవ చేశారు. నంద్యాల ఉప ఎన్నిక సీటు విషయంలో తనపై శీత కన్ను వేశారని శిల్పా మోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమవుతుందని శిల్పా మోహన్ రెడ్డి జోష్యం చెప్పారు.