రాష్ట్రపతి ఎన్నికపై త్రిసభ్య కమిటీ

SMTV Desk 2017-06-13 11:28:15   The BJP Trincomalee Committee on the Presidential election, National Presidents Amit Shah,Venkiah Naidu, Rajnath Singh and Arun Jaitley

న్యూఢిల్లీ, జూన్ 13 : భారత దేశ రాష్ట్రపతి ఎన్నిక దగ్గరకి రావటంతో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. సోమవారం ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షా సీనియర్‌ మంత్రులతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ సభ్యులుగా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్డీయే భాగస్వాములతో పాటు, ఇతర పార్టీలతో కూడా ఈ కమిటీ సంప్రదింపులు జరపనున్నారు. తాము బలపరిచే అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి వీలుగా ఈ కమిటీ ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి అనువుగా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం సాధించడానికి వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని ఈ కమిటీని అమిత్‌ ఆదేశించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవం కాని పక్షంలో జూలై 17న పోలింగ్, 20న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థి ఎంపికపై చర్చలు జరిపేందుకు ప్రతిపక్షాలు కూడా రంగం సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో అధికార ఎన్డీయే కూటమి ప్రతిపాదన స్పష్టమయ్యేవరకూ వేచిచూ డాలనే ధోరణిని ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్నా యి. అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాన్ని రూపొందించడానికి ప్రతిపక్ష పార్టీల నేతలతో కూడిన కమిటీ బుధవారం సమావేశం కానుంది. అధికార, ప్రతిపక్ష కూటములకు దూరంగా ఉంటున్న ఒడిషాలోని బీజేడీని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన విందు భేటీలో బీజేడీ పాల్గొనలేదు.దాంతో బీజేపీకి ఆ పార్టీ మద్దతుపై ఆశలు పెరిగాయి. తటస్థ వైఖరిగల అన్ని పార్టీలతో చర్చించాలని కమిటీకి అమిత్‌ షా సూచించినట్లు సమాచారం. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలని ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 15న ప్రతిపక్షాల సబ్‌ కమిటీ భేటీకానుందని అయితే, ఈ పార్టీలతో బీజేపీ త్రిసభ్య కమిటీ సంప్రదింపులు జరిపి విపక్షాలకు కూడా ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ప్రతిపాదిస్తే మరో అభ్యర్థి పోటీలో ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నెల 14న రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలవుతున్నాయి. నామినేషన్లకు చివరి గడువు ఈ నెల 28వ తేదీ ఉన్నట్లు వెల్లడించారు.