కేంద్ర సాయంపై రాజీలేదు: చంద్రబాబు

SMTV Desk 2017-11-21 10:26:36  chandrababu in assembly, amaravathi updates, chandrababu speech in assembly

అమరావతి, నవంబర్ 21: రాష్ట్రానికి అందాల్సిన సాయంపై కేంద్రంతో రాజీ పడనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అసెంబ్లీలో సోమవారం ఉపాధి హామీపై లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాకు కొందరు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం. మళ్లీ ఇబ్బంది పెట్టొద్దు. ఏ రాష్ట్రానికీ ఇవ్వనందున దానికి సమానమైన సాయం అందుతుందనే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నా. కేంద్రం నుంచి ఇప్పటివరకు వచ్చిన నిధులపై ఇదే సమావేశాల్లో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా రావాల్సిన మిగతా నిధులకు మరోసారి దిల్లీ వెళదాం. ప్రతిపక్షం కంటే నేనే ఎక్కువసార్లు దిల్లీ వెళుతున్నా. నన్ను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా దిల్లీ వెళ్లి చెప్పొచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో లేనిపోని సమస్యలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్పించొద్దని స్పష్టం చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తు సామగ్రి అవసరాలకు (మెటీరియల్‌ కాంపోనెంట్‌) కేటాయించిన రూ.3,216 కోట్లను కేంద్రానికి తిరిగి స్వాధీనం చేసిందని చెప్పారు. నాడు ఎనిమిదేళ్లలో రూ.16,871 కోట్ల ఉపాధి నిధులు ఖర్చు చేస్తే, కేవలం మూడేళ్ల వ్యవధిలో తాము రూ.16,571 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. వస్తు సామగ్రి అవసరాలకు రూ.7,255 కోట్లు వెచ్చించి గ్రామాల్లో ఆస్తులు సృష్టించామని పేర్కొన్నారు. అందరూ వినూత్నంగా ఆలోచించాలి. ఇటీవల సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సచివాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ సైకిళ్ల కోసం నిర్మించిన షెల్టర్లు చూశారు. వాటిపై సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌తో అక్కడ ఏసీలు ఏర్పాటు చేయవచ్చని సూచించారు. అందరూ అలాంటి ఆలోచనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.