ఏపీలో పెట్టుబడులకు 37 కొరియా సంస్థలు..

SMTV Desk 2017-11-19 12:57:56  South Korea Team Ready to Invest in AP, CM Chandrababu naidu, Kim Hung Tae.

అమరావతి, నవంబర్ 19 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ కిమ్‌ హంగ్‌ టేతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియాలోని పరిశ్రమలు ఆసక్తిగా చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 37 కొరియా సంస్థలు రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు. వీటి ద్వారా అక్కడ రూ.4వేల కోట్ల పెట్టుబడులు, ఏడు వేల మందికి ఉద్యోగావకాశాలు రాబోతున్నాయన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కొరియా సంస్థలకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని, ఇప్పటికే ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో కొరియా భాషను నేర్పే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఇదిలా ఉండగా బంధాలను మరింత చేసుకోవడానికి వీలుగా తమ దేశంలో పర్యటించాలని కిమ్‌ హంగ్‌ టే విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.