ప్రారంభం కానున్న119 బిసి గురుకులాలు

SMTV Desk 2017-06-12 13:00:41  119 BC Gurki, Minority Residential Schools,Chief Minister kcr is formally inaugurated on Monday

హైదరాబాద్, జూన్ 12 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక బీసీ గురుకులాన్ని నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం కార్యరూపం దాల్చేందుకు అంతా సిద్ధమైంది. మొత్తం 119 బీసీ గురుకులాలకు ప్రభుత్వం అనుమతినివ్వగా.. అవి సోమవారం ప్రారంభం కానున్నాయి. ఇక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమవడంతో హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని బీసీ గురుకుల విద్యాలయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన సరూర్‌నగర్‌లో జరిగే కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీలు కే కేశవరావు, ఎం ఏ ఖాన్, అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొంటున్నట్లు సమాచారం. మిగిలిన బీసీ గురుకులాలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభించేలా బీసీ సంక్షేమ శాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 121 మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూళ్లు ముస్తాబయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ విద్యాలయాలు సోమవారం నుంచి మూడు విడుతలుగా ప్రారంభంకానున్నాయి. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొత్తగా ప్రారంభించనున్న 119 బీసీ గురుకులాల్లో మొత్తం 30,560 సీట్లకుగాను ఇప్పటికే 25వేల మంది విద్యార్థులు మొదటి విడుత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం పొందారు. మిగిలిన సీట్లను అధికారులు త్వరలో భర్తీ చేయనున్నారు.