డోక్లాం వివాదం తర్వాత తొలి చర్చ...

SMTV Desk 2017-11-18 11:45:00  doclam boarder, india- china, meetings, bijing

బీజింగ్, నవంబర్ 18 : భారత్- చైనా మధ్య దాదాపు 75 రోజులపాటు, డోక్లాం సరిహద్దుల్లో వివాదం రేగిన విషయం తెలిసిందే. సరిహద్దును దాటి చైనా చేపడుతున్న రోడ్డు నిర్మాణాన్ని భారత బలగాలు నిలువరించాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక సందర్భంలో చైనా భారత్ బలగాలను ఉపసంహరించకపోతే, యుద్ధం జరుగుతుందని హెచ్చరించింది. చివరకు ఆగస్టు ఆఖరి వారంలో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఈ వివాదం సద్దుమణిగిన తర్వాత తొలిసారిగా రెండు దేశాలు సరిహద్దు చర్చల్లో పాల్గొన్నాయి. భారత్‌-చైనా సరిహద్దు వ్యవహారాలపై కన్సల్టేషన్‌, కో ఆర్డినేషన్‌ వర్కింగ్‌ మెకానిజం(డబ్ల్యూఎంసీసీ) 10వ రౌండ్‌ సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు చర్చల గురించి బీజింగ్‌లోని భారత ఎంబసీ అధికారికంగా ప్రకటించింది. డోక్లాం వివాదం తర్వాత భారత్‌-చైనా మధ్య సరిహద్దు చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఇరు దేశాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొని సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితి, ఇరు దేశాల సైనిక కార్యకలాపాలను సమీక్షించారు.