రక్తసిక్తమైన రహదారులు...

SMTV Desk 2017-11-17 14:52:05  road accident, telangana, crime, hyderabad,

హైదరాబాద్, నవంబర్ 17: రాష్ట్రంలో పలు చోట్ల రోడ్లన్నీ రక్తసిక్తమయ్యాయి. తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాలలో పది మందికి పైగా మృత్యు వాత పడ్డారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. • కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ ఎస్సారెస్సీ వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. • చామన్‌పల్లి నుంచి ఇల్లంత మండలం కొత్తూరుకు పత్తి ఏరడానికి 16 మంది కూలీలు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పాలవ్యాన్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ మాధవరావుతో పాటు ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో పది మంది గాయపడ్డారు. • మేడ్చల్‌ జిల్లా పేట్‌ బషీరాబాద్‌ పరిధిలోని సుచిత్ర కూడలి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. • మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తూముకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. • నల్గొండ జిల్లా కట్టంగూరు వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. బాధితులను అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్ర దొడ్డి గ్రామస్థులుగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆయా ప్రాంతాలన్నీ విషాద ఛాయలతో అలుముకున్నాయి.