శ్రీవారి దర్శనం...ఇక శీఘ్రమే...

SMTV Desk 2017-11-17 13:04:14  ttd, new scheme, tirumala tirupathi devastanam,

చిత్తూరు, నవంబర్ 17: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఇక శీఘ్రంగా దర్శించుకునేందుకు తితిదే ఒక ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక, కాలినడక భక్తులకు అమలవుతున్న విధంగా సర్వదర్శనం భక్తులకూ సైతం రెండు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం కలిగించే నూతన విధానం అమలులోకి తీసుకురానుంది. ఎలా అంటే...? తిరుమలలోని 21 ప్రాంతాలతో పాటు కాలినడక మార్గాల్లో 150 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దివ్యదర్శనం టోకెన్ల తరహాలో బార్‌కోడింగ్‌ టోకెన్లను ఉచితంగా జారీచేయనున్నారు. పారదర్శకత కోసం శ్రీవారి దర్శనం టోకెన్‌తో ఆధార్‌కార్డును అనుసంధానం చేయాలని తితిదే నిర్ణయించింది. టోకెన్‌పై కేటాయించిన సమయానికి వైకుంఠం-2 ముఖద్వారం వద్దకు చేరుకుంటే ఆలయంలోకి అనుమతిస్తారు. వీరికి 2-3 గంటల్లోనే దర్శనం సౌకర్యం కల్పిస్తారు. రాయితీపై రూ.20 ధరతో రెండు, పాటు కోరితే రూ.50 మరో రెండు చొప్పున మొత్తం నాలుగు లడ్డూలకు టోకెన్‌ అందజేస్తారు. ఆధార్‌కార్డు తీసుకురాని యాత్రికులు ప్రస్తుతం అమలవుతున్న సర్వదర్శనం విధానం కింద శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.టోకెన్‌ పొందిన యాత్రికులు నిర్దేశించిన సమయానికి చేరుకున్నట్లైతే 2 నుంచి 3 గంటల వ్యవధిలో శ్రీవారి దర్శనం కల్పిస్తామని టిటిడి వెల్లడించింది. ఇక క్యూలైన్లలో, కంపార్ట్‌మెంట్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండదు. టిటిడి నిర్ణయంపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.