176 ఏళ్లుగా దాచి పెట్టిన ఒక ఉన్మాది శిరస్సు

SMTV Desk 2017-06-11 15:01:25  Porchugal,Galisiya,Farmers,Diogo Alves

పోర్చుగల్, జూన్ 10 : రష్యా విప్లవకారుడు.. రాజకీయవేత్త వ్లాదిమిర్‌ లెనిన్‌ చనిపోయి 90ఏళ్లు గడిచినా ఆయన మృత దేహాన్ని ఇంకా మ్యాసోలియంలో భద్రపర్చారు. ఆయన గొప్పతనాన్ని రాబోయే తరాలకు చెప్పడమే కాదు.. ఆయన్నే స్వయంగా చూపించాలనే ఉద్దేశంతో రసాయనాల సాయంతో భౌతికకాయాన్ని జాగ్రత్తగా దాచిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖులను రసాయనాల సాయంతో భద్రపరచడం సాధారణమే కానీ పోర్చుగల్‌లో మాత్రం ఓ నేరస్థుడి తలను 176 సంవత్సరాలుగా పదిలపర్చుతున్నారు.. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యానికి లోనవ్వాల్సిందే. డియోగొ అల్వెస్‌ ఒక సీరియస్ కిల్లర్‌. 1810లో గాలిసియాలో జన్మించిన అతను చిన్నతనంలోనే పోర్చుగల్‌కి వలస వెళ్లాడు. ఆ తర్వాత నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అక్కడే ఓ పెద్ద కాలువ వద్ద నిల్చొని ఆ దారిలో వెళ్తున్న రైతుల్ని అడ్డగించి వారి వద్ద ఉన్న డబ్బులు తీసుకుని ఆ కాలువలోకి తోసేవాడు. అలా మూడేళ్లలో 70మందిని కాలువలోకి తోసి హత్య చేశాడు. ప్రభుత్వం ఆ కాలువను మూసివేయగానే ఇళ్లలో చోరీ చేయడం ప్రారంభించాడు. అడ్డు వచ్చినవారిని కిరాతకంగా హతమార్చేవాడు. దీంతో పోలీసులు అతికష్టం మీద అల్వెస్‌ను పట్టుకున్నారు. కోర్టు అతనికి ఉరి శిక్ష విధించింది. 1841లో అతన్ని ఉరి తీశారు. అయితే.. అదే సమయంలో కొందరు శాస్త్రవేత్తలు.. లిస్బన్‌లోని మెడికల్‌ కాలేజీ బోధకులు మనిషి పుర్రెకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అల్వెస్‌ తలను తమకు అప్పగిస్తే అతను నేర వృత్తిలోకి ఎందుకు దిగాడో.. ఎందుకు అలా హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వానికి చెప్పి తలను స్వాధీనం చేసుకున్నారు. దానిపై ఎన్ని పరిశోధనలు చేసినా అతను అలా నేరాలు చేయడానికి కారణం మాత్రం తెలియలేదు. పోర్చుగల్‌లో చివరిసారిగా ఉరి శిక్ష పడిన వ్యక్తి.. అతి కిరాతక హంతకుడు కావడంతో అతని తలను అలాగే భద్రపర్చారు. ప్రస్తుతం అల్వెస్‌ తల ‘ఫ్యాకల్టీ ఆఫ్‌ మెడిసిన్‌ ఆఫ్‌ ది యూనివర్శిటీ ఆఫ్‌ లిస్బన్‌’లో ఉంది.