విహార యాత్ర కాదు.. విషాద యాత్ర..

SMTV Desk 2017-11-13 11:19:14  krishna river, ap cm, vijayawada, Picnic, chandrababu naidu

కృష్ణ, నవంబర్ 13 : విహార యాత్రకు వచ్చి అందాలను చూడాల్సిన వారు అనంత లోకాలకు వెళ్లారు. కృష్ణ నదిలో పడవ బోల్తా పడడంతో పెను విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఒంగోలు వాకర్స్‌ క్లబ్‌కు చెందిన బృందం 60 మంది రెండు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్లో అమరావతికి ఆదివారం ఉదయం వచ్చారు. ఇక్కడ పలు ప్రదేశాలను సందర్శించిన తర్వాత విజయవాడలోని పున్నమిఘాట్‌కు వారు సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నుంచి పడవలో పవిత్ర సంగమం వద్ద నిత్య హారతిని తిలకించేందుకు వెళ్లాలనుకున్నారు. అక్కడే ఉన్న ప్రైవేటు సంస్థ రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌కు చెందిన పడవను మాట్లాడుకున్నారు. ఈ పడవలో 20 మందిని కంటే ఎక్కువ ఎక్కడానికి వీలు లేకపోయినా 38 మందిని ఎక్కించారు. పడవ పున్నమి ఘాట్‌ నుంచి పవిత్ర సంగమం వద్దకు బయలుదేరుతుండగా గోదావరి జలాలు కలిసే చోట ఒక్కసారిగా కుదుపులు వచ్చాయి. దాంతో ఉలిక్కిపడ్డ ప్రయాణికులు అందరు ఒకవైపు రావడం.. అప్పుడు డ్రైవర్‌ పడవను పక్కకు తిప్పడంతో బోల్తా పడింది. ఈత వచ్చినవాళ్లు కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. మరికొందరు పడవను పట్టుకుని వేలాడుతూ ఉండిపోయారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపట్టినా కొందరిని మాత్రమే రక్షించగలిగారు. ఇలా మొత్తం 19 మంది మృతి చెందగా, 15 మంది బయట పడ్డారు. మిగతా నలుగురు గల్లంతు అయ్యారు. వారీ ఆచూకి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రులు నారాయణ, అఖిలప్రియ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైసీపీ నాయకుడు పార్థసారధి, సీపీఎం నాయకుడు బాబూరావు, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌, జడ్పీ అధ్యక్షురాలు గద్దె అనూరాధలతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.