ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న ట్రంప్...

SMTV Desk 2017-11-13 10:45:05  Indian Prime Minister Narendra Modi, trump, Bilateral meetings

మనీలా, నవంబర్ 13 : ఆసియన్, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలా బలోపేతమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఆయా దేశదినేతలతో చర్చలు జరుపనున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఫిలిప్పీన్స్ చేరుకున్న మోదీ ఫిలిప్పీన్స్, జపాన్, చైనా, అమెరికా, రష్యా అధినేతలతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. కాగా, ప్రధాని మోదీ ఆదివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమై, ప్రత్యేక విందుకు హజరయ్యారు. చైనా ప్రధానమంత్రి లీ కెఖియాంగ్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. జపాన్‌ ప్రధాని షింజో అబే, రష్యా ప్రధాని ద్మిత్రి మెద్వెదేవ్‌, మలేసియా ప్రధాని నజీబ్‌ రజాక్‌లతోనూ ఆయన ముచ్చటించారు. వీటికి సంబంధించిన ఛాయాచిత్రాలను మోదీ ట్వీట్‌ చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖుల గౌరవార్థం ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతెర్టె ఈ విందునిచ్చారు. నరేంద్రమోదీతో పాటు ఇతర నేతలంతా ఫిలిప్పీన్స్‌ జాతీయ దుస్తులైన ఎంబ్రాయిడరీ చొక్కా (బరోంగ్‌ తగలోంగ్‌)లను ధరించారు. దాదాపు 1300 మంది అతిథులు హాజరైన భారీ విందులో ఫిలిప్పీన్స్‌ ప్రసిద్ధ వంటకాలను వడ్డించారు. నేడు ఆసియాన్, తూర్పు ఆసియా దేశాలతో ప్రసంగించనున్న ప్రధాని మోదీ అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ తో మధ్యాహ్నం మరోసారి సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.