ఐటీ చట్టం అమలుపై పాక్షిక స్టే

SMTV Desk 2017-06-10 17:09:41  Partial stay on IT law enforcement, 139-AA clause Ake Sikri, Ashok Bhushan, Parliament

హైదరాబాద్, జూన్ 10 : ఐటీ-ఆధార్ అనుసంధానం కేసు లో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్య లు చేయడంతో ఐటీ రిటర్నుదాఖలకు ఆధార్ సంఖ్యా జతచేయడం తప్పనిసరి చేసే చట్ట నిబంధన సరైనదేనని స్పష్టం చేసింది. పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కుందని నొక్కిచెప్పింది. అయితే 139-ఏఏ నిబంధన జోరును కొంత తగ్గించాలి అని పార్లమెంటుకు సలహా ఇచ్చింది. ఆధార్ ఉన్నవాళ్లు పాన్‌తో ఆ నంబరును నమోదు చేసుకోవాలని. లేనివాళ్లు అవసరం లేదని వెల్లడించింది. ఏకాంత, మానవ గౌరవ హక్కులను ఆధార్ ఉల్లంఘిస్తుందా? అనేది రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుందని, ఈలోగా పాన్‌లు చెల్లుబాటు కాదని అనడం మాత్రం కుదురదని సర్కారుకు కోర్టు స్పష్టం చేసింది. ఆదాయపన్ను రిటర్ను దాఖలుకు ఆధార్ సంఖ్య అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్రం తెచ్చిన చట్టం చెల్లుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఆధార్ అమలులో వ్యక్తి ఏకాంతహక్కుకు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడేంతవరకు ఐటీ చట్టం అమలుపై పాక్షిక స్టేను విధించింది. ఐటీ చట్టంలో 139-ఏఏ నిబంధనను చేర్చే విషయంలో పార్లమెంటుకు సర్వహక్కులు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. న్యాయమూర్తులు ఏకే సిక్రీ, అశోక్ భూషణ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆధార్ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఐటీ చట్టంలోని 139-ఏఏ నిబంధన తీవ్రతను తగ్గించాలని ధర్మాసనం పార్లమెంటుకువెల్లడించింది. పాన్ నంబర్ల రద్దు, రిటర్నుల దాఖల పై నియంత్రణల వంటి చర్యలు తీవ్ర విపరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించింది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధన వివక్షాపూరితంగా ఉందని, వృత్తివ్యాపారాల నిర్వహణపై అది నిర్హేతుకమైన నియంత్రణలు విధిస్తున్నదన్న పిటిషనర్ల వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆధార్ పథకంలో వ్యక్తి ఏకాంత హక్కుపై, మానవగౌరవంపై వ్యక్తమవుతున్న ఆందోళనలు ప్రస్తుతం తాము పరిశీలించడం లేదని, ఆ సంగతి రాజ్యాంగ ధర్మాసనం చూసుకుంటుందని స్పష్టం చేసింది. హక్కులు, డేటా లీకేజీ వంటివి అక్కడే తేలుతాయని ధర్మాసనం పేర్కొన్నది. ఆధార్ పథకంలో డేటా లీకేజీ కాకుండా కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పౌరులకు డేటా లీకేజీ కాదని నమ్మకం కలిగేలా సర్కారు వీలైనంత త్వరగా సబబైన రీతిలో తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అని ధర్మాసనం నొక్కిచెప్పింది. ఐటీచట్టం, ఆధార్ చట్టం లోని నిబంధనల మధ్య ఎలాంటి వైరుధ్యం లేదని స్పష్టం చేసింది. ఐటీ రిటర్నుకు పాన్ నంబరు జతచేయడం తప్పనిసరి చేస్తూ ఐటీ చట్టంలో 139-ఏఏ నిబంధనను సర్కారు ఫైనాన్స్ బిల్లులో భాగంగా చేర్చి పార్లమెంటు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి పాన్ నంబరుకు ఆధార్ లింకు తప్పనిసరి అంటూ ఆదాయపన్ను శాఖ స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజ్యాంగ ధర్మాసనం ఆధార్‌పై తుది నిర్ణయం వెలువరించేంత వరకు ఈ నిబంధన అమలును పాక్షికంగా నిలిపివేసింది. అంటే ఆధార్ ఉన్నవాళ్లు నంబరు ఇవ్వాలి. లేనివాళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈలోగా ఆధార్ లేని పాన్ నంబర్లు చెల్లవని అనడం మాత్రం కుదరదని ధర్మాసనం వివరించింది.