జగన్ వల్ల ఫలితం శూన్యం : చంద్రబాబు

SMTV Desk 2017-11-11 11:09:34  AP Legislative assembly, AP CM Chandrababu naidu, ys jagan controversy.

అమరావతి, నవంబర్ 11 : ఏపీ శాసన సభ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్యారడైస్ లీకుల వ్యవహారంలో జగతి పబ్లికేషన్స్ లోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు వార్తలు వస్తున్న విషయాన్ని సీఏ౦ ప్రస్తావించారు. గతంలో సాండూర్‌ పవర్‌ ప్రాజెక్టులోకి కూడా ఇదే విధంగా అక్రమ మార్గాల్లో డబ్బు మళ్లించారని ఆయన పేర్కొన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటే జగన్ ప్రతి పనికి అడ్డుపడుతున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులకు తను అడ్డుపడడం, కోర్టుకు వెళ్ళడం వంటివి చేయలేదని, లోటు పాట్లు అవినీతి గురించి మాత్రమే పోరాటం చేశామన్నారు. పాదయాత్రలు చేసిన వారంతా ముఖ్యమంత్రులు కాలేరన్న చంద్రబాబు 2014 సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల కూడా పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతిపక్షం లేని సభ ఎలా ఉందన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. తాము ప్రజల కోసమే పని చేస్తున్నాం గాని ప్రతిపక్షం కోసం కాదన్నారు. శాసనసభలో ప్రతిపక్షం లేకపోవడం పెద్ద వార్త కాదన్న ఆయన జగన్ ఉంటే అల్లరి, సమావేశాలను అడ్డుకోవడమే గాని ఫలితం మాత్రం శూన్యం అన్నారు. ప్రతిపక్షం లేదు కాబట్టే ప్రజల సమస్యల గురించి లోతుగా ఆలోచిస్తున్నామని వెల్లడించారు. జగన్ అవినీతి ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకోవాలన్నారు. అవ్వన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్నాయి కాబట్టి ఏమి చేయలేకపోతున్నామని అవే రాష్ట్ర ప్రభుత్వ చట్టాలననుసరించి ఎప్పుడో స్వాధీనం చేసుకునే వారం అని తెలిపారు. అవినీతి తగ్గుతుందన్న ఉద్దేశంతోనే పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు ఇచ్చానన్నారు. ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయన్నారు.