హైకోర్టు దెబ్బకు దిగొచ్చిన ధరలు..

SMTV Desk 2017-11-09 17:28:58  tirumala, Subscriber traders, high court, TTD.

తిరుమల, నవంబర్ 09 : తిరుమలలో దైవ దర్శనానికి వచ్చే భక్తులను ప్రతిచోట బడా బాబులు దండుకుంటున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. ఇదివరకు తిరుమల హోటళ్ళ ముందు ఉన్న ధరల పట్టికలో ఒక ధర ఉంటే వాటిని అధిక ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకున్నారు. ఈ విషయంపై పలుమార్లు భక్తులు అధికారులకు విన్నవించారు. కాని ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎట్టకేలకు ఈ విషయంపై హైకోర్టు స్పందించింది. కోర్టు సూచనల మేరకు టీటీడీ సూచించిన విధంగా ధరల పట్టికను నిర్ణయించి హోటళ్ళ ముందు పెట్టారు. పట్టికలో చూపిన ధరలకన్నా ఎక్కువకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఒకవేళ అదే జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా సూచించే విధంగా ఫోన్ నంబర్లను హోటళ్లలో ప్రదర్శిస్తున్నారు. నిన్నటి వరకు రెండు ఇడ్లీల ధర రూ. 25 కాగా, ఇప్పుడది రూ. 7.50కు తగ్గింది. రూ. 15 వరకూ అమ్మిన టీ ధర ఇప్పుడు రూ. 5, రూ. 100 పలికిన భోజనం ధర రూ. 31కి దిగి వచ్చింది. ఈ దెబ్బతో దందా వ్యాపారుల ఆటలకు కళ్ళెం పడింది. ఈ విషయంపై భక్తులు స్పందిస్తూ ఈ పరిస్థితిని పక్కాగా అమలు చేసి మళ్ళీ ఇలాంటి దందాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.