అక్రమాస్తుల్లో మరో అవినీతి తిమింగలం...

SMTV Desk 2017-11-08 19:17:54  AP Assistant Commissioner of State Devasaya Vijaya Raju, ACB Searches, Vijayawada

విజయవాడ, నవంబర్ 08 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులకు మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. నేడు ఉదయం రాష్ట్ర దేవాదాయశాఖ సహాయ కమిషనర్ విజయరాజు గృహంలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. దేవాదాయశాఖకు అధికారిగా ఉండడంతో ఏకంగా దేవుడి సొమ్మునే దోచేసి రూ. 100 కోట్లకుపైగా అక్రమంగా ఆస్తులు ముట్టగట్టుకున్నట్లు అధికారులు అంచనా వేసి తెలిపారు. విజయవాడ, హైదరాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఆరు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు పట్టుచీరలు చూసి నిర్ఘాంతపోయారు. ఒక్క ఆయన నివాసాల్లోనే కాకుండా ఆయా ప్రాంతాల్లోని బంధువులు, సన్నిహితుల వద్ద కూడా సోదాలు చేశారు. ఈ సోదాల్లో సుమారు రూ.30లక్షల విలువచేసే 563 పట్టుచీరలను గుర్తించింది. ఒక్కో చీర ధర రూ.లక్ష నుంచి రూ.2లక్షలు ఉంటుందని సమాచారం. ఇంత భారీగా చీరలు పట్టుబడటం ఇదే తొలిసారి. దేవాదాయ శాఖలో ప్రస్తుతం సహాయ కమిషనర్‌గా ఉన్న విజయరాజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పర్యవేక్షిస్తుంటారు. ఏసీబీ డీఎస్పీ రమాదేవి నేతృత్వంలో అధికారుల బృందం ఈ సోదాలు చేపట్టింది. ఈ మేరకు పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.