రాష్ట్రమంతటా హై అలర్ట్

SMTV Desk 2017-06-10 12:01:46   High state of the state, checks, Intelligence Bureau, kashmir encouter

హైదరాబాద్, జూన్ 10 : రాష్ట్రం మొత్తం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘావర్గాలు చేసిన హెచ్చరికల సందర్భంగా పోలీసులు రాష్ట్రం అంతటా ముఖ్యంగా హైదరాబాద్‌లో తనిఖీలు ముమ్మరం చేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘా పెంచి అనుమానితులుగ కనిపించే వారిని ఇంటలిజెన్స్ విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్‌సెప్టర్ వాహనాలతో అన్ని ప్రాంతాల్లో గస్తీ పెంచడం తో పాటు ఐటీ జోన్లు, షాపింగ్‌మాళ్లు, పర్యాటక కేంద్రాలు, సినిమాహాళ్లు వంటి ప్రదేశాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రతపై తగిన జాగ్రతలు తీసుకునేందుకు ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలకు సూచనలు చేస్తున్నారు. షాపింగ్ మాల్స్‌లోకి వచ్చేవారిని మెటల్ డిటెక్టర్ ద్వారాల నుంచే లోనికి అనుమతించాలని, నిరంతరం సీసీ టీవీల ద్వారా పరిశీలించాలని చెప్పారు. గచ్చిబౌలిలోని ఐటీ జోన్‌పై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. కశ్మీర్‌లో మూడురోజుల క్రితం భద్రతాదళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే. వారి వద్ద లభించిన సెల్‌ఫోన్లలో దేశంలో దాడులు జరిపేందుకు కుట్రపన్నినట్లు సమాచారం ఉన్నదని తెలిసింది. దాంతో కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా హై అలర్ట్‌గా ఉండాలని అధికారులు దేశంలోని అన్ని రాష్ర్టాలను హెచ్చరించింది. ముఖ్యంగా లోగడ ఉగ్రవాద సంబంధిత దాడులు జరిగిన రాష్ట్రాలు పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. కేంద్రం నుంచి వచ్చే సాధారణ హెచ్చరికల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు.