తెలుగురాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు?

SMTV Desk 2017-05-28 16:52:51  Assembly,AP,TS,increase assembly seats,

హైదరాబాద్, మే 26 : తెలుగు రాష్ట్రాల్లో శాసన సభ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా లేదా అనేది సందిగ్దంగా మారింది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ సందర్భాల్లో వెల్లడించిన ప్రకారం వచ్చే శాసన సభ ఎన్నికల్లోపే పునర్విభజన ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న 175 స్థానాలను 225 స్థానాలకు, తెలంగాణలో ఉన్న 118 స్థానాలను 165 కు పునర్విభజన చేయాల్సి ఉంది. అయితే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ లోక్ సభలో తెలుగురాష్ట్రాల సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ప్రకరణ 170(3) ప్రకారం 2026 వరకు లోక్ సభ, శాసన సభ నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని ప్రకటించారు. అయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో వచ్చే శాసన సభ ఎన్నికల నాటికి పునర్విభజన పూర్తయి, పునర్విభజన ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంతా భావిస్తున్నారు. అందుకు మద్దతుగా కేంద్రం సిక్కింలో అసెంబ్లీ స్థానాలను 32 నుండి 40 కి పెంచుతూ పునర్విభజనకు నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రజాభిప్రాయ సేకరణ కోసమై బహిర్గతం చేసింది. ఆ రాష్ట్రాల్లో ఉన్న లింబూ, తమాంగ్ సామాజిక వర్గాలకు అసెంబ్లీలో రిజర్వేషన్ కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో కూడా పునర్విభజన ప్రక్రియ ద్వారా అసెంబ్లీ స్థానాలను పెంచుతారని భావిస్తున్నారు. శనివారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్ జూలైలో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని బహిరంగంగా ప్రకటించారు. రాజ్యాంగ సవరణకు ఆస్కారం లేకుండానే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోట్ల రూపాయలు చేతుల్లో పెట్టుకొని రాజకీయ ఉద్యోగం కోసమై క్యూలో నిల్చున్న రాజకీయ నిరుద్యోగులకు సువర్ణావకాశం లభించనుంది.