ఆ కరెన్సీని తిరస్కరిస్తే చర్యలు తప్పవు : ఆర్బీఐ

SMTV Desk 2017-11-05 11:21:54  Currency, RBI rule, Social networking site rumors,

న్యూఢిల్లీ, నవంబర్ 05 : కరెన్సీ నోట్లపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల వల్ల ప్రజలకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే రూ. 10 నాణేలు చెల్లడం లేదంటూ ప్రచారం జరగడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన రూ. 2000, 500 నోట్లపై గీతలు ఉంటే అవి చెల్లవంటూ ప్రచార౦ సాగుతోంది. ఈ నేపథ్యంలో రూ. 10 నాణేలు చెల్లుబాటు అవుతాయని, కరెన్సీ నోట్లపై రాతలున్న అవి చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ అధికారికంగా ఎన్ని ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. క్లీన్ నోట్ విధానం ప్రకార౦.. నోట్లపై రాతలు రాయకూడదు. కాని కొన్ని సందర్భాల్లో పలు బ్యాంకుల సిబ్బంది, వ్యాపార వర్గాలు వాటిని లెక్కించి వాటిపై సంఖ్యను వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ నోట్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. కాని ఆ నోట్లు చెల్లుతాయని అధికారిక వర్గాలు చెబుతున్నా.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను చూపిస్తూ ఆ నోట్లు చెల్లవంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. ఇదిలా ఉండగా నోట్లపై గీతాలున్నా, నీటిలో తడిచి రంగు పోయినా వాటిని తిరస్కరించకూడదని ఆర్బీఐ ఏప్రిల్ 5 వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ప్రజల నుండి నోట్లను తీసుకోకుండా తిరస్కరిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.