తెలంగాణ ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి

SMTV Desk 2017-11-04 13:29:06  telangna state karthika punnami celebrations, temples, hyderabad

హైదరాబాద్‌, నవంబర్ 04 : తెలంగాణ రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజున నదిలో పుణ్య స్నానాలు ఆచరించటం ఆనావయితీగా వస్తున్న తరుణంలో భద్రాచలం క్షేత్రంలో తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. బాసర క్షేత్రానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి గోదావరి తీరాన ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. సాయంత్రం నదీమతల్లికి వేదపండితులు మహాహారతి ఇవ్వనున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వేయిస్తంభాల గుడి ఆవరణలో లక్షదీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.