సీఎంకు లేఖ రాశారు.. సమస్య తీర్చుకున్నారు

SMTV Desk 2017-11-03 11:33:50  CM KCR, peddagundavelli high school, TELANGANA GOVERNMENT,

హైదరాబాద్, నవంబర్ 3: ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు తమ బడి సమస్యను ఎలాగైనా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకొని, ఏకంగా ముఖ్యమంత్రి కేసిఆర్ కే లేఖ రాసి నిధులు మంజురయ్యేలా చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి ఉన్నత పాఠశాల 3.32 విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అందులో 3.26 ఎకరాలలో విద్యార్ధులకు ఆడుకునేందుకు సరిపడా ఖాళీ స్థలం ఉంది. సమస్య ఏంటంటే.. పాఠశాలకు అనుకోని ఓ ఆలయం ఉంది. దీంతో అక్కడికి వచ్చే భక్తులు వేసే చెత్తాచెదారం అంతా పాఠశాల ముందుకు చేరేది. ఈ సమస్యకు పరిష్కారం ప్రహరీ గోడ కట్టడం ఒక్కటే అని భావించిన 8వ తరగతి విద్యార్ధులు, తమ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు సూచన మేరకు 2014 నవంబర్ లో సీఎం కేసిఆర్ కు లేఖ రాశారు. ఈ లేఖకు సీఎం కేసిఆర్ స్పందిస్తూ 2015 జనవరి 27న నిర్మాణానికి కావాల్సిన నిధులను పంపించాలని అధికారులకు లేఖ రాశారు. అయితే నిధులు రావడం జరిగింది, కానీ అవి సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, పాఠశాలకు రంగులు వేయించేందుకు పంచాయితీరాజ్ శాఖ అధికారులు కేటాయించారు. మళ్లీ ఈ సమస్య వార్తల్లోకి రావడంతో అప్పటి జిల్లా విద్యాధికారి కృష్ణా రెడ్డి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 500 మీటర్ల మేర నిర్మాణానికి రూ.10 లక్షలు మంజురయ్యాయి. ప్రస్తుతం ప్రహారీ పనులు కొనసాగుతున్నాయి. తమ సమస్య ఇప్పటికి తీరడంతో విద్యార్ధులు హర్ష భావం వ్యక్తం చేస్తున్నారు.