మిషన్‌ భగీరథ పనులపై అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

SMTV Desk 2017-11-03 11:27:26  Minister Harishrao, orders the officials on Bhagirathis work, medak dist

హైదరాబాద్, నవంబర్ 03 : ఈ సంవత్సరం చివరికల్లా అన్ని నియోజకవర్గాలకు రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులపై గురువారం శాసనసభ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఇందులో ఏ మాత్రం అలసత్వాన్ని సహించేది లేదని ఆయన తెలిపారు. జాతీయ రహదారులు, సర్వీసు రోడ్ల నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ పనులు వేగంగా జరగాలని, గజ్వేల్‌కు వచ్చే ఏడాది రైలు రావాల్సిందేనని తెలిపారు. ఇకపై ప్రతి శనివారాన్ని మిషన్‌ భగీరథ దినంగా భావించి వేగంగా పనులు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్‌ సెగ్మెంటులో డిసెంబరు 31లోగా పనులు పూర్తి చేస్తే దేశంలో ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షిత నీటిని అందించిన తొలి జిల్లాగా సిద్ధిపేట నిలుస్తుందన్నారు. రైల్వే స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన అటవి భూములను సేకరించాలి. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూములను 2017 చట్టం కింద సేకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్‌, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, తదితరులు హజరయ్యారు.