కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణం

SMTV Desk 2017-06-09 13:13:16  Congress party, MLA, Palwai Govadhan Reddy, MP, Minister

హైదరాబాద్, జూన్ 9 : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణానికి గురయ్యారు. పార్లమెంటు స్థాయి సంఘం సమావేశం కొరకు ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని కులు మనాలి వెళ్తూ, కారులో ప్రయాణించే సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. దానిని గమనించిన సహచర ఎంపీలు తొందరగా దగ్గరలోని వైద్యశాలకు తీసుకెళ్ళడంతో వైద్యులు గోవర్ధన్ ను పరీక్షించి చనిపోయినట్టు దృవీకరించారు. ఆయన వెంట అతని సతీమణి , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతానికి గోవర్ధన్ రెడ్డి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి లో 1936, నవంబర్ 19 న పాల్వాయి రంగారెడ్డి, పాల్వాయి అనుసుయామ్మ దంపతులకు గోవర్ధన్ రెడ్డి జన్మించారు. ఈయన రాజకీయంలో ఎంతో పేరును సంపాదించారు. రాజకీయాల్లోకి ప్రవేశించకముందు వ్యవసాయదారుడిగానే కాకుండా, రాజకీయ, సామాజిక కార్యకర్తగా పనిచేశారు. 1967-72, 1972-78, 1978-33, 1983-85, 1983-85, 1999-2004 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1981 లో గ్రామీణ నీటి సరఫరా, యువజన సంఘాల మంత్రిగా పని చేశారు. 1982 లో జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. 2012 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తుచే ఎన్నుకోబడిన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2012 ఆగస్టు నుంచి నీటి వనరుల మంత్రిత్వశాఖ కమిటీలో, పౌర విమానయాన మంత్రిత్వశాఖ కమిటీలో సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. 2013 లో పిటిషన్ కమీటీలో సభ్యునిగా చేరారు.