బ్యాంకులకు ఓ వ్యాపారి 5 వేల కోట్లు టోకరా

SMTV Desk 2017-11-02 18:25:44  bank loans, merchant Gagan Dhawan, cheating case.

ఢిల్లీ, నవంబర్ 02 : దేశంలో సామాన్యులు, రైతుల రుణాలకు ముఖం చాటేసే బ్యాంకులు బడా వ్యాపారులను నమ్మి వేల కోట్ల రూపాయలను రుణంగా మంజూరు చేస్తూనే ఉన్నాయి. కింగ్ ఫిషర్ మాల్యా 9 వేల కోట్లు బ్యాంకుల కన్సార్టియంకు అప్పుగా ఉండి లండన్ పారిపోయిన విషయం మరవక ముందే దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ ఎగవేత వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన గగన్ ధావన్ అనే వ్యాపారి బ్యాంకుల నుండి 5 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని ఎగనామం పెట్టాడు. ఈయనకు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ సంస్థపై సిబిఐ కేసు నమోదు చేయగా, ఇడి అధికారులు కూడా రంగంలోకి దిగి గగన్ ధావన్ ను అరెస్ట్ చేశారు. గగన్ ధావన్ కు బ్యాంకులలోని కొందరు అధికారులు లంచాలు తీసుకొని సహకరించి ఉంటారని, లేకుంటే ఇన్ని వేల కోట్ల రుణం ఎలా ఇచ్చి ఉంటారని సామాన్యులు అనుమానిస్తున్నారు. గతంలో గగన్ పై కాంగ్రెస్ నేతలకు, ఐటి అధికారులకు లంచాలు ఇచ్చారన్న అభియోగాలున్నాయి. సామాన్యులు రుణం కోసం బ్యాంకు తలుపు తడితే సవాలక్ష ప్రశ్నలు, తనఖా పెట్టనిదే రుణం ఇవ్వని పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో బడా వ్యాపారులకు వేల కోట్ల రుణాలు బ్యాంకులు మంజూరు చేయడం అంతు చిక్కని విషయమే.