కోడంగల్ నుంచే కారు ప్రయాణం మొదలు : కేటీఆర్

SMTV Desk 2017-11-02 12:57:55  telangana it minister, ktr, Kondangal constituency,

హైదరాబాద్, నవంబర్ 02 : కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నిరుద్యోగులు, అవకాశ వాదులు, స్వార్ధపరులు ఎందరు చేరినా వచ్చే ఎన్నికల్లో గులాబీ దండయాత్రను ఎవరూ ఆపలేరని తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగిన తెరాస పార్టీ చేరికల కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కుటుంబ పాలన గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని సుదీర్ఘ౦గా పాలించి ఏమీ అభివృద్ధి చేయలేదని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తేరాస జైత్రయాత్రను రాహుల్ గాంధీ కాదు కదా వాళ్ళ జేజెమ్మ వచ్చిన ఆపలేరని తెలిపారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోట్ల కేసులో అడ్డంగా దొరికి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర పరువును తీశారని తెలిపారు. గతిలేని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎన్ని కుయుక్తులు పన్నిన కారు వేగాన్ని అందుకోలేరని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన కోడంగల్ కు చెందిన టిడిపి, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, సర్పంచులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలను సాదరంగా ఆహ్వానించారు. మరోపక్క తెదేపా నల్గొండ ఇ౦చార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి ప్రగతి భవన్ లో కెసిఆర్ తో సమావేశమై దాదాపు 30 మంది మండలాధ్యక్షులతో 6వ తేదీన తెరాసలో చేరతామని చెప్పగా సీఎం స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జితేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మా రెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీనివాస గౌడ్ పాల్గొని కోడంగల్ కు మంచి రోజులు వస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.