రాహుల్ ప్రోత్సాహంతో నిర్భయ సోదరుడి లక్ష్యం...

SMTV Desk 2017-11-02 10:55:38  Congress vice president Rahul Gandhi, nirbhaya brother Aman, Pilot

న్యూఢిల్లీ, నవంబర్ 02: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి నిర్భయ తల్లి కృతజ్ఞతలు తెలిపారు. 2012 సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ‘నిర్భయ’ సోదరుడు ప్రస్తుతం పైలట్‌ అయ్యాడు. నిర్భయ తల్లి తెలిపిన వివరాల ప్రకారం...నా కుమారుడు అమన్‌ రాహుల్‌ గాంధీ వల్ల పైలట్‌ అవ్వగాలిగాడు. ఇందుకు రాహుల్‌ గాంధీ అమన్‌కు చాలా సాయపడ్డారు. అక్క దారుణంగా చనిపోయిందన్న బాధతో కుమిలిపోతున్న అమన్‌కు రాహుల్‌ కౌన్సిలింగ్‌ ఇప్పించి ధైర్యానివ్వడంతో పాటు మంచి చదువు చెప్పించారు. రోజూ ఫోన్‌ చేసి అమన్‌తో మాట్లాడేవారు. నా కుమార్తె చనిపోయినప్పుడు అమన్‌కు పన్నెండేళ్లు. మిలిటరీలో చేరాలన్నది వాడి ఆశ. కానీ అక్క మరణాన్ని తట్టుకోలేక షాక్‌లో ఉండిపోయాడు. ఆ తర్వాత అమన్‌ గురించి రాహుల్‌కి చెప్పాను. ఆయన అమన్‌కు తోడుగా ఉంటూ పైలట్‌ ట్రైనింగ్‌ కోర్సు చేయాల్సిందిగా కోరారు. ఇందుకోసం పదో తరగతి పూర్తవగానే ఉత్తర్‌ప్రదేశ్‌లోని రేయ్‌ బరైలీలోఉన్న ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరన్‌ అకాడమీలో సీట్‌ ఇప్పించారు. కానీ అమన్‌ మాత్రం చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయాడు. అప్పుడు రాహుల్‌ అమన్‌కు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పేవారు. ఓ పక్క పైలట్‌ ట్రైనింగ్‌ తీసుకుంటూనే తన సోదరి కేసులో తీర్పు ఎంత వరకు వచ్చిందో తెలుసుకుంటూ ఉండేవాడు. రాహులే కాదు ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా నాకు ఫోన్‌ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకునేవారు. వారి దయ వల్ల మా అబ్బాయి త్వరలో విమానం నడపబోతున్నాడు. అని చెప్పుకొచ్చారు. నిర్భయ కేసు విషయంలో నిందితులను ఉరి తీయడంలో జరుగుతున్న ఆలస్యంపై వివరణ ఇవ్వాలని తీహార్‌ జైలు అధికారులకు ఢిల్లీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.